Thursday, December 23, 2010

ఎందుకు చెపుతాను వెఱ్ఱికుంకా! - (Final Part)

************************************************************************

మఱి ఏలాగున నుండవలెనని యడుగుచున్నారా? ఎట్టిపిచ్చిలో నేవిధమైన వెగటును లేదో, ఎట్టియున్మాదము పాఠకోద్ధరణపటిష్ఠమో, యెట్టిమతిమాలిన తనములో జ్ఞానవిజ్ఞానములు దుర్నిరీక్ష్యమైన తేజస్సుచే వెలుగునో, యెట్టి వెర్రికి వేయివిధములు కాక కోటివిధములయ్యును పాఠక గ్రహణవిధాన మనునొక్కటే విధానమున్నదో, యెట్టి వెఱ్ఱి వెఱ్ఱులన్నిటికంటె వెఱ్ఱిదో యట్టి వెఱ్ఱిని, నట్టి వెఱ్ఱిలేని వెఱ్ఱిని గలిగి తాను ధన్యతఁ జెంది పాఠకుల ధన్యులఁ జేయు నాతఁడు కవి. ఇప్పుడైన నట్టిపిచ్చిలక్షకుఁ గోటి కెవ్వనికైన నుండినయెడల వాఁడు కవితాగానము చేయవచ్చును. అంతేగాని వాని కవిత్వమున నేదో ఘనత యున్నదని నిరూపింప అసందర్భకవితలు సృజించి యకాలపు వెర్రులై పాఠకుల కాపత్తుఁ దెచ్చిపెట్టుట పాటిఁగాదు. కవిత్వము గుణములో నున్నదికాని గణములో లేదని తెలుసుకోవలె. అభిప్రాయప్రకటన సమంజసముగానుండుటయే కావలసినది.

ఆ "జ్ఞానము" నంతను సంపాదించవలెనన్న కోరిక యుండవలెనుగాని "అజ్ఞానము" సంపాదించవలెనన్నఁ గోరికకుఁ దోడుపడనక్కఱలేదు.  కొద్దిమంది పాఠకులేదైన నొక కవితనామోదించి యా కవిని, కవితను పొగుడుట సిద్ధించునెడల ఓహో వ్రాయవలసిన పద్ధతి యదియే కాఁబోలని తామరతంపరగా లోపల నీయపోహకు లోనైయుండకఁ దమ శక్త్యానుసారము, జ్ఞానానుసారము, విచక్షణానుసారము, అనుభావానుసారము, అనుభవానుసారము వ్రాయవలెను. వ్రాసినదే వ్రాయక, వ్రాతలకు పదును పెట్టుకొనవలెను.

అదియటులించినఁ బాఠకులలోఁ దక్కువవారు లేరు. నూటి కెనుబదుగురు రసగ్రహణమునఁ గేవలము మూఢులు. పామర కవితలఁ గవుల తయితక్కలకు బళీయందురు కాని రసప్రాప్తి, రసాస్వాదన యొక్క ముడుల చిక్కువిప్పిన కవితలుఁ దలకెక్కవు. కుక్కగొడుగులేవో, గులాబులేవోఁ దెలియని పాఠకులు అనుచిత కరతాళధ్వనులు మాఁని రసప్రపంచమనగనేమో ముందు తెలుసుకొనవలె. తెలిసినంత ఆలోచించవలె. ఆలోచించినంత ఆస్వాదించవలె. మామిడిపూఁత మసూచిపోఁత యొకటే యన్న, గోరంటపూవు వాసన యెట్టిదో కప్పకూఁతలట్టివి యన్న యెవరికి ముదములందును? ఆ జ్ఞానమును సంపాదించికొనవలె. అన్నియు బహిర్గతాంతసత్త్వములే. కవితలలో మంచివానిని బహుమానింపవలెను. చెడ్డవానిని బహిష్కరింపవలయును. 

సమకాలీనఁ గవులలో కొలదిమంది, చాల కొలదిమంది శక్తివంచన లేకుండ శారదాదేవి పూజకై నిజమైన కవులుగాఁ బాటుపడుచున్నారో చూడుడు! ఇన్ని పాటులుపడి యేమి బాధాప్రతిఫల మొందుచున్నారో యెఱుఁగుదురా? ఎందులకు ? వారు వ్రాసిన కవితలు రచనలు మంచివో చెడ్డవో చూచినతరువాతఁగదా తెలియవలసినది? అట్లు చూచినవా రెవరు? చూచుట కోపిక యెవరికి? చూచుటకుఁ దీరిక యెవరికి? చూచుట కంత భాషాభిమాన మెవరికి? కవితాభిమామెవరికి? రసానుభవమెవరికి? చూచుట కక్షరజ్ఞానమైన నెందఱకు?

ఆంధ్ర పాఠకులలో విరివిగా లెక్కచూచుకొనిన యెడల నూటికిరువదిమంది కాంధ్రభాషాజ్ఞాన మున్నదేమో! యా యిరువదిమందిలో పదుగురకు కవితాజ్ఞాన మున్నదేమో! ఆ పదుగురిలో నిద్దఱకు కోతులభాగవతమునందున్న ఆసక్తి గోవిందనామస్మరణ యందు లేదు. మరినిద్దఱు తామేఁ బండితులమని విఱ్ఱవీగుచు మిగిలినారుగురి నెత్తిన మొట్టుచుంటిరి. ఈ పైమొట్లనుదించుఁ మిగిలిన యారుగురిలో ముగ్గురుఁ దమక్రింది మెట్టున నున్న ముగ్గురిని మొట్టుచున్నారు. ఈ సయ్యాటలుఁ యెప్పటికి యాగునో ఆ భగవంతునికేఁ దెలియవలె!

ఇదివఱకు మనము కాంచిన మహాకవులందరు గతించినారు. వారంతా ఒడలు జలదరించునట్లు, కనులు కృతార్థములగునట్లు, మనస్సు పుష్పించునట్లు, జన్మను తరించునట్లు పాఠకులకు సాక్షాత్ శారదామాత దర్శన భాగ్యముఁ గలిగించినారు. వారి స్థాయిని అందుకోమనిఁ జెప్పుటలేదు, కవులన్న నామము తగిలిచుకున్నందుకు కనీస బాధ్యతగా ఆ దిశగాఁ బ్రయత్నము చేయుడు.

ఆ శారదాదేవినిఁ బరికింపుడు. అనేక సహస్రచంద్రమండల సన్నిభమైన యాస్యమండలము వీణాదండమువంక రవంత యొఱిగి యున్నది. అందుచే@ గిరీటమునుండి వ్రేలాడుచున్న ముత్తెములగుత్తి మేరువునొద్దనున్న వీణబిరడపై వ్రేలాడుచున్నది. బాగుగాఁ బరిశీలింపుడు. ఎడమమోఁ కాలిపై మడఁచినకుడిమోఁకాలివంపు ప్రక్కను రవంత వెనుకగ దేవతాచందన నిర్మితమైన వీణకుండ ప్రకాశించుచున్నదే. దివ్యసర్వసుధాసేచనమున వీణాదండము తీఁగచెట్టు చిగిర్చిన ట్లామె యెడమ చేయివ్రేళ్ళు తంత్రులపై నెట్లు కదలుచున్నవో! అహా! అదిగో గుడివైపున రాజరాజనరేంద్రుఁడు, నెడమవైపునఁ గృష్ణదేవరాయలు వింజామరములు చేతఁ బుచ్చుకొని యెట్లు వీచోపులిడుచున్నారో! అదిగో! ఆపీఠము మొదటఁ బీతాంబరపు నడకట్టుతో నిలువఁబడి దేవికి వీవనలు విసురుఁచున్న ఆనాటి మహాకవులుఁ గనపడుటలేదా! ఎంతటి సుందరమైన దృశ్యము. మీకునూ యాదేవికి వీవనలు విసరాలనిపించుటలేదా? ఆ కోరికయే మా బోఁటి పాఠకులదీ. మేల్కొనండి కవులారా! మేల్కొనండి... 

ఎవని కవిత్వము దుక్కు, ఎవని కవిత్వము ముక్కు, ఎవని కవిత్వము పెంట, ఎవని కవిత్వము పంట అని జుట్లు పట్టుకొను భాగ్యము నుండిఁ బాఠకులను రక్షింపుడు. అందరుఁ బ్రయోజకులే! అంద ఱప్రయోజకులే! మీకు బుద్ధిలేకపోవుటచేత నెప్పటి కప్పటికే పరాకు. ఆ "బుద్ధి" ప్రసాదించమని ఆ శారదమ్మను వేడుకొనుడు..

మీరు మీ ఉన్మాదముతోఁ జిన్నమెదడును బెద్దమెదడుగాఁ జేయునెడల పాఠకునికి ఉన్మాదము, పిచ్చి హెచ్చును. బలిపశువైనఁ బాఠకుడు "ఇటువంటి" వ్రాతలు వ్రాయును. కావున జాగురూకులై వ్యవహరించుడు.


చూడవలయును జూడవలయున నని మనస్సు వాంచించుట చేతనే కదా శరీరమునకుఁ గన్నులు కలిగినవి! తినవలయును తినవలయునని సంతతవాంఛ కలుగుటచేతనే కదా శరీరమునకు నోరు వచ్చినది! మనస్సులోని సంచలనములవలననే కదా దేహమున కవయవవైవిధ్యము కలిగినది. అటువంటి మనసును మీ అపరిపక్వపు గవితలతో పారిశుద్ధ్యసంఘమువారి బండితుక్కువలెఁ బాఠకుల మీదకుఁ బోయక పరశురామప్రీతి జేయక, జాగరూకులై వ్యవహరించుడని హెచ్చరించుచు -

మఱియొకసారి పానుగంటివారికి, జంఘాలశాస్త్రి గారికి హృదయ పూర్వక క్షమాపణలతో ......శలవు...

సర్వేజనా స్సుఖినోభవంతు

************************************************************************

మొదటి భాగం ఇక్కడ...

రెండవ  భాగం ఇక్కడ...

పూర్తి పాఠం పి.డి.ఎఫ్ పత్రంగా ఇక్కడ...

భవదీయుడు

మాగంటి వంశీ

2 comments:

  1. "మరినిద్దఱు తామేఁ బండితులమని విఱ్ఱవీగుచు మిగిలినారుగురి నెత్తిన మొట్టుచుంటిరి."
    కారణాలనేకం.
    వీపుగోకుడుతోనే ముదురుతున్న జాడ్యం ఇది.
    ఓపికగా వేచిఉందాం! మంచి సాహిత్యాన్ని మన శక్తి మేరకు ప్రోత్సహించుదాం!

    ReplyDelete
  2. మీ వ్యాసం బాగుందండీ. మీరు స్పృశించని ఒక అంశం ఉంది. శ్రీశ్రీ కాలం నుండి తెలుగు కవులు తమ కవితలతో సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని, సామజికప్రయోజనం లేని కవిత్వం అసలు కవిత్వమే కాదన్న భావన. సామాజిక అంశం స్పృశించని కవిత్వం ప్రభావశీలం కాదని గట్రా భ్రమలున్నాయి. ఇదెంతలా పాతుకుపోయిందంటే ఏదో ఒక వాదం లేకుంటే అదసలు కవిత్వమే కాదన్నంత .ఉదాహరణకి పొద్దు లో అఫ్సర్ ఇంటర్వ్యూలో కొన్ని అభిప్రాయాలు చూడండి.
    1) "అస్తిత్వ చైతన్యం గురించి మన ఆలోచనలు ఇంకా సూటిగా వుండాలి. ఇప్పటికీ శుద్ధ మానవతా వాదం, శుద్ధ కవిత్వం గురించి మాట్లాడే వాళ్ళని చూస్తే జాలేస్తోంది. ప్రపంచ సాహిత్యం ఎంతో కొంత చదివే తెలుగు వాళ్ళు కూడా ఆ రకంగా మాట్లాడడం అన్యాయం."
    2) "సౌందర్య దృష్టి గురించి అదొక అపోహ మాత్రమే. అదొక స్టీరియోటైప్ మాత్రమే. శ్రమ కన్నా సౌందర్యం లేదు. శ్రమించకుండా సౌందర్యం పుట్టదు."
    3) "సిద్ధాంత ప్రచారం కోసం కవిత్వాన్ని వాడుకోవడం అదృష్ట కరమని నా అభిప్రాయం. కవిత్వాన్ని అలా వాడుకోకూడని చెప్పడం ఇంకో రకం రాజకీయ సిద్ధాంతమే. అది పచ్చి దగా."
    వీళ్ళకి అంతరాంతరాళాల్లో ఈ కవిత్వం ద్వారా సామాజికోద్ధరణ ప్రోగ్రాం పై భ్రమలు తొలగనంత కాలం తెలుగు పాఠకులకి ఈ బాధలు తప్పవు. before anyone jumps to argument మంచి కవితలో అస్తిత్వ వాదం ఉంటే తప్పులేదు కాని అస్తిత్వ వాదం ఉన్నంతమాత్రాన కవిత మంచిది కాదని నా అభిప్రాయం. ఉదయమాలకి వ్యాసాలు, కవిత్వం కాని వచనం, సందేశాన్ని యధాతథంగా ప్రవచించే గేయాలు చేసినట్టుగా ఓ లయ, పసలేని కవిత్వమనబడే వచనం ఏపాటి మేలు చేస్తుందనేది నాకు అర్థం కాని విషయం.

    ReplyDelete

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.