Saturday, December 18, 2010

ఎందుకు చెపుతాను వెఱ్ఱికుంకా! - (Part 1)

జంఘాల శాస్త్రి ప్రేరణతో ఈ క్రింది ఉన్మత్త విహారం మొదలుపెట్టాను - దమ్మున్న వాళ్లు చదువుకోండి. అంతకు మించి ఇంకేదన్నా వున్నవాళ్లు కామెంటండి. :)

ఉన్మత్తుడవే కదా అని అంటారా?

అవును - ఈ సారి ఉన్మత్తుడవటానికి కారణభూతులు ఈనాటి కవులే.

వాళ్లను అనే బదులు, రాబందులా పీక్కు తినే బదులు మరి నువ్వే వ్రాయొచ్చుగా?

అదే ఉంటే నిన్ను మంగలి కత్తెర తీసుకురా అని ఎందుకు చెపుతాను వెఱ్ఱికుంకా!

సరే కుంకలను వదిలి విషయంలోకి వచ్చేస్తూ -

పానుగంటివారికి నమస్సుమాంజలులతో, వారి జంఘాల శాస్త్రి గారికి, చదువుకుని, భుజాలు తడుముకుని బాధపడ్డవారికి క్షమాపణలతో

ఉపోద్ఘాతం:

ఈనాటి కవితల్లో 'క్రమం' అనేది సున్న. కవుల్లో మరింత నున్నగానున్న గండుపిల్లిలాటి గుండు సున్న. శిల్పం, వస్తువు అనేది ఎండమావి. ప్రేరణ అనేమాట పచ్చి అబద్ధం. చెప్పక తప్పదంటే కీర్తికండూతే తప్ప కవితాప్రేమ ఈ ప్రపంచంలో లేదు. కవిత అనే మాటకి - చంపి తినడం అని అర్థమైతే, సృష్టిలో కావలసినంత, కావలసినన్ని భావప్రేరకాలున్నాయి. ఎంతసేపు ఈనాటి కవికి తన కీర్తి, తన భజన, అచ్చేస్తే వచ్చే డబ్బుల ఆలోచన, ముఖస్తుతి, తనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకే ఆలోచన. అంతకు మించి పోడు. ఇందులో కొంచెం హెచ్చుతగ్గులుండవచ్చుగాని మూలసూత్రం మాత్రం స్వార్థమే. పరోపకారం, పాఠకోపకారం అనేది ఎక్కడైనా పొరపాటున వుంటే, అది కూడా మారువేషం వేసుకున్న స్వార్థమే.

మూలకారణమైన అనిర్వచనీయమైన మహాశక్తి నుంచి అనేక అంధప్రాయాలైన శక్తులు పుట్టాయి. భావప్రేరకాలు పుట్టాయి. మనుషుల్ని, పాఠకుల్ని పునాదుల్లోకంటూ కదిలించి ఆకారణంగా సంఘాలకు సంఘాలే కూల్చేసే ప్రాకృతిక, కవితా శక్తులివి. ఆటలమ్మ, మశూచి వంటివి జబ్బులు కావు. ఇలాటి అకారణ, ఉన్మత్త శక్తులైన కవులే జబ్బులు. భయంకర కవుల్ని సైతం పండితుల పేర్లతో పూజిస్తాం. అయినా మనుషులకి, పాఠకులకి మతిలేదు.


ఉన్మత్త విహారం:

సృష్టిలోనున్న...అంత వద్దనిన ఆంధ్రదేశ కవితాలోకములోనున్న యొక్కొక్కని యాకిట్లు చింప నిశ్చయించినాను. ఈ కవిత్వమునంత నాశనమొనర్చుటయే మంచిది. కవిత, పనికిమాలిన కవిత, అర్థము లేని కవిత, నశించుటయే సమంజసము. ఈ గవితలలో నొక యుద్దేశమున్నాదా? నీతి యున్నదా? శాసనమున్నదా? ప్రేమయున్నదా? ఒక క్రమమైన నున్నదా?

మన పండితులేమని చెప్పిరో వింటివా? ఈ కవితలలో సత్తు లేదు, అసత్తు లేదు, పగలు లేదు, రాత్రి లేదు, శాశ్వతత్వము లేదు, ఒక్కటియే యున్నది. వెఱ్ఱి. అది తనంత తానే కాక కవియందు నిలబడుకుని యున్నది. దానికి వేరు లేదు. అయిననూ మహావృక్షముద్భవించును. ఫెళ్లున జనపదుల నెత్తిన బడుటకునూ, బుఱ్ఱలు బద్దలు గొట్టుటకునూ. ఇట్లెందులకు ఉద్భవించెనో దానికే తెలయును. అదికూడ నెఋఁగునని చెప్పవలనుపడదు. ఆ గవితలలో వస్తువు యొక్క యునికి యున్నది, లేదు. వెఱ్ఱివాని మస్తిష్కమునుండి తన సృష్టి కలిగిన దనుసంగతి యా కవిత ఎఱుఁగును, ఎఱుఁగదు. ఇట్టిదే ఆ కవితా తత్త్వమనియు, స్వరూపమనియు మనఁ బండితులు స్థిరపఱచినారు. ఆ తత్త్వమూ, స్వరూపమూ పాఠకునికి తెలియుటా, తెలియకపోవుటా? తెలియుట కాదు, తెలియకపోవుట కాదు. తెలియకపోవుట, తెలియుట యనఁగా నిదియే. కవి గూర్చి యెఱుఁగకపోవుటయే జ్ఞానము. ఎఱుఁగుట యజ్ఞానము. యీ బుద్ధి యున్నవాడు బుద్ధిమంతుడని ఎల్లరూ అంగీకరించవలసిన విషయము.

మఱి ఇక్కడనున్న పాఠకుని స్థితి యెట్లున్నది? కొద్దిపాటి జ్ఞానమున్నదనుకొందము. మంచి ఉద్దేశమున్నదనుకొందము. బుద్ధి యున్నదనుకొందము. అట్టి పాఠకునికి ఈ గవితలు చేతి కరదండములుగఁ, గాళ్ళకు సంకెలగఁ, గంటికి గంతలుగ, మనస్సుకు దిగపీఁకుడుగ నుండుటచేఁ బాఠకులు యెదుగు బొదుగులేక, శరీరమున నల్పులగుచు, బుద్ధియందు అత్యల్పులగుచు, జ్ఞానమున నంధులై, కవి చిత్తమను చెఱసాలలో బానిసవలె యున్నారనియు,  నీపిశాచమునుండి యెంతత్వరగ విముక్తినొందుదుమో యంతత్వరలో అయ్యద్ది పాఠకులకు సమస్తజనసోదరత్వమే కాక, సర్వజీవులయందు దయ గల్గుననియు, అట్లగుటకుఁ దగిన వీర్యము, వెన్నెముక, విదగ్ధత కలవారగుననియు, దేశమునకు, జాతికీ యథార్థముగ మనుజజన్మమునకుఁ గూడ లాఘవకరమైన, లజ్జాకరమైన ఈ "నన్నుఁ జదవవద్దన" బుద్ధిహీనపు పశుప్రాయపు వ్రాతలెప్పుడు పరశురామప్రీతి యగునో యప్పుడే పాఠకులకు జాత్యైక్యము సంభవించుననియు, జాత్యైక్యముతో దూరతీరాలకేగినఁ శరీరపాటవము, శరీరపాటవముతో సౌఖ్యసంపదయు, సౌఖ్యసంపదతోఁ జిత్తవికాసము, చిత్తవికాసముతో పిడచగొట్టుకొనిబోయిన బుద్ధిస్థైర్యము తిఱిగి వచ్చుననియు మనముపన్యాసపీఠములపై సింహగర్జనము లొనరించవలెను.

తెల్లసుద్దకవికి మరి విభూతిపాఠకునికి బడదు, సుద్దముక్కల రెంటికిఁ జుక్కయెదురు, పగిలిన విభూతిపండునకు తెల్లరసుద్దకు నైధనతారవరుస, సుద్దదారి సుద్దది విభూతిబూడిదలకు. ఇంతటితో సరిపోయినదా. ఊహూఁ. బెడ్డవ్రేట్లను సహించినట్లు, సుద్దవ్రేట్లనూ, ఆపైని సుద్దల వారి గవితలను సహించిననూ పాఠకునకుఁ దీయని ఫలము ద్రక్కుట లేదు.  పట్టులేక గాలిలో సర్వశ్రమములఁ బొంది యల్లాడుచు మేఘములు మనకు అమృతసుధలవంటి నీరములిచ్చుచున్నవి, కత్తికోఁతను సహించుచు మేకఁలు మన కాహార మగుచున్నవి. తమగడ్డి తాము దినుచు గోవులు మనకుఁ గుంభవృష్టిగ మధుమధుర క్షీరముల నిచ్చుచున్నవి. పేఁడచేఁ బెంటచే సంతుష్టినొంది సమస్తధాన్యసమృద్ధిని సర్వం సహాదేవి సమకూర్చుచున్నది. పశువులు సైతము ప్రానహీనములగు వస్తువులు సైతము స్వార్థపరిత్యాగ మాచరించి పదార్థసంవిధాన మొనర్చుచున్నవి. మఱి "సుద్దముక్కలేమిఁ" జేయుచున్నవి యని అడిగిన సమాధానము దొఱకదయ్యె! ఇంతటి దైన్యస్థితి నుపహరింపుటకు కెక్కడనైనఁ యవకాశము నున్నదేమో కానీ ఆంధ్రదేశమునందలి పాఠకవరేణ్యులకు మటుకు లేదు. జంతువులను ప్రేమించవచ్చును, కఠినత్వమునుఁ బ్రేమించవచ్చును, పాచి మఱియు పెంటలనుఁ బ్రేమించవచ్చును, గానీ ఈ సుద్దముక్కలఁ గవులనుఁ బ్రేమించుట యసాధ్యము, దుర్లభము, దుస్సాధ్యము మఱియు కాలహరణమూ.

సూర్యుఁడు దాను గర్భానలజ్వాలాజాలముచే మండి పోవుచుఁ బ్రపంచమున కారోగ్యమును బ్రాసాదించునట్లు సర్వకష్టనిష్ఠుర తలకోర్చి జనోపకారమాచరించవచ్చను కొద్దిపాటి జ్ఞానము, బుద్ధి నీగవులకు లేకపోయినదే! హతవిధీ! కూపములేని కుగ్రామమున్నది. కోమటిదుకాణములేని కుగ్రామమున్నది. బ్రాహ్మణుడులేని కుగ్రామమున్నది. సుద్దముక్క కవులు లేని కుగ్రామమున్నదా? లేదు. లేనేలేదు. గతించిన కాలములోనైన యీ సుద్దముక్కలు బ్రద్దలుగొట్టుటకుఁ యవకాశముండినదేమో గానీ సమకాలీనఁ గాలమునందు, భవిష్యత్ కాలమునందుఁ యా యవకాశము లేదని నొక్కి వక్కాణించవచ్చును.

 తిట్లు దీవనచే నడఁగుననియుఁ, గొట్టు పెట్టుచే శాంతించుననియుఁ, గత్తివ్రేటు కౌఁగిలిచేఁ బోవు ననియు, శత్రుత్వము మిత్రత్వముచే సడలుననియుఁ అనుభవైకవేద్యమే. గానీ యీ కవులు మంచిమాటలతోనేమి, వట్టిమాటలతోనేమిఁ గృతార్థులు కాఁగలరా యన్నది శేషప్రశ్నయే!  

జాతిద్రోహము, మిత్రద్రోహము, దేశద్రోహము, మతద్రోహము, దైవద్రోహము కవితలతో సమూలముగ నెగిరిపోవచ్చును. ఆ జ్ఞానమున్న కవులెందరు? పంగనామములచే భాగవతోత్తముఁడవు కాఁగలవా? ఆనపకాయచే సన్న్యాసివి కాఁగలవా? అటులనే సుద్దముక్కఁల మాఁటలచే కవివి కాఁగలవా?

కవితారాధన కవితారాధన యని యందువుకద, కవితకు ముక్కా, నోరా? తలయా? తోఁకయా? వ్యాకరణము ననుచరించి వాక్కుల నాచరించువాడు కవి. పాఠకులనే గాక సర్వభూతములను తనతో సమానముగఁ జూచుకొనువాడు కవి. తాను తన కవిత, తన బుద్ధి, తన సర్వస్వము పాఠకజనసేవ కని త్రికరణశుద్ధిగ నమ్మి ప్రతిఫలవాంఛాశూన్యుఁడై పాఠకసేవ యొనర్చువాఁడు కవి. అంతేకాని నోటియందాడిన అర్థములేని మాటలు జంకు, సిగ్గు యెగ్గు లేక సంభాపీఠమున నిలువఁబడి యసత్యము పలికినట్లుఁ బలుకుచు నామూల నుండి మరియొక మూలకుఁ బనిలేక తిరుగుతు పాఠకులను యల్లాడించు నద్భుతపురుషులగు మీరు కవు లగుదురా? 

(సశేషం!!)

తదుపరి భాగం వచ్చేవారం!

9 comments:

  1. హయ్య బాబోయి! ఐనను వేచి చూచేదము గాక!

    ReplyDelete
  2. వీర శివాజీలా ధైర్యంగా ముందు వచ్చి, ముందుకు వచ్చి - కామెంటినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. Now we are talking.. :)

    ReplyDelete
  4. అమృతసుధలవంటి

    అమృతం, సుధ సమానార్థకాలు కదండీ? Am I missing the sarcasm here? :)

    ReplyDelete
  5. జాతిద్రోహము, మిత్రద్రోహము, దేశద్రోహము, మతద్రోహము, దైవద్రోహము కవితలతో సమూలముగ నెగిరిపోవచ్చును. ఆ జ్ఞానమున్న కవులెందరు? పంగనామములచే భాగవతోత్తముఁడవు కాఁగలవా? ఆనపకాయచే సన్న్యాసివి కాఁగలవా? అటులనే సుద్దముక్కఁల మాఁటలచే కవివి కాఁగలవా?

    కవితారాధన కవితారాధన యని యందువుకద, కవితకు ముక్కా, నోరా? తలయా? తోఁకయా? వ్యాకరణము ననుచరించి వాక్కుల నాచరించువాడు కవి. పాఠకులనే గాక సర్వభూతములను తనతో సమానముగఁ జూచుకొనువాడు కవి. తాను తన కవిత, తన బుద్ధి, తన సర్వస్వము పాఠకజనసేవ కని త్రికరణశుద్ధిగ నమ్మి ప్రతిఫలవాంఛాశూన్యుఁడై పాఠకసేవ యొనర్చువాఁడు కవి. అంతేకాని నోటియందాడిన అర్థములేని మాటలు జంకు, సిగ్గు యెగ్గు లేక సంభాపీఠమున నిలువఁబడి యసత్యము పలికినట్లుఁ బలుకుచు నామూల నుండి మరియొక మూలకుఁ బనిలేక తిరుగుతు పాఠకులను యల్లాడించు నద్భుతపురుషులగు మీరు కవు లగుదురా?


    Clap! Clap!! Clap!!!

    ReplyDelete
  6. RK - సుధ అంటే పాలు అని కూడా అర్థం. అమృత-సుధ వాడుకకు బాగుంటుందని అక్కడ పడ్డది.....ఎకసెక్కానికైతే అమృతం పాలలా కురిసి నీరైపోతోందని అర్థం చెప్పుకోవచ్చేమో...:) కానీ అక్కడ పడ్డ అమృతసుధ వాక్యం ఎకసెక్కానికి కాదు...తర్వాత వచ్చే సుద్దముక్కల ఎకసెక్కానికి ఊతమన్నమాట...

    ReplyDelete
  7. LOL, this is what you call Hardhitting :)

    ReplyDelete
  8. తాను తన కవిత, తన బుద్ధి, తన సర్వస్వము పాఠకజనసేవ కని త్రికరణశుద్ధిగ నమ్మి ప్రతిఫలవాంఛాశూన్యుఁడై పాఠకసేవ యొనర్చువాఁడు కవి.
    ------
    Beautiful

    ReplyDelete
  9. Bharadwaj / Rao Lakkaraju - కామెంటినందుకు ధన్యవాదాలు

    ReplyDelete

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.