Thursday, September 30, 2010

విచిత్రమైన జాతి మరింత విచిత్రమైన మనుషులు!!

తెలుగోడు ఎక్కడున్నా విచిత్రాలు కనపడుతూనే ఉంటాయేమో! అందులోనూ దేశంకాని దేశంలో మఱీను.

ఇక్కడి అమెరికాలో కొంతమంది తెలుగోళ్ళను భాఘా ధఘ్ఘరఘా సూసిన మడిసిగా మీకో పెశ్న....

ఈ కింది రకాల్లో మీకెవుడన్నా తగిలాడా?

విషయంలోకి వచ్చేస్తూ - ఉదాహరణకు ఒక తెలుగోణ్ణి తీస్కుందాం. పేరు కామేశ్ అనుకుందాం. వాడి భార్యామణి పేరు లక్ష్మి అనుకుందాం. కామేశ్ మీ ఆఫీసులోనే పనిచేస్తున్నాడనుకుందాం ..కామేశ్,లక్ష్మి కలిసి సుమారుగా సంవత్సరానికి ఓవరు టైము లెక్కకాకుండా, అనగా ఓవరుటైము పక్కనబెట్టగా లక్షా డెబ్భైవేల డాలర్లు సంపాదిస్తారు అనుకుందాం. ఏదైనా గీసి గీసి బేరమాడి కొనుక్కుంటారు అనుకుందాం.

ఇప్పుడు కామేశ్ చేసే కొన్ని పనులు -
A)కామేశ్ "కాష్" ఇచ్చి ముప్ఫైవేల ధర గల కార్లు ఓ మూడు కొంటాడు. కొని,ఆ కార్ల ఇన్స్యూరెన్సు బోల్డు అయిపోతోందంటాడు
B)కామేశ్ ఇల్లు కొనాల్సివచ్చిందిఅనుకుందాం. కొనుక్కున్న పాత ఇల్లు లాభానికి అమ్మి, "ఎబ్బే అది అమ్మితే ఏమొచ్చింది! మట్టిబెడ్డలు? పైగా మాకే ముప్ఫై వేలు లాసొచ్చింది. ఎలానో ఏమో" అంటాడు.
C)తర్వాతి నెలలోనే పాత ఇల్లు అమ్మగా వచ్చిన లాభాన్ని "డవును పేమెంటుగా" కట్టి కొత్త ఇల్లు కొంటాడు.
D)కామేశ్ లక్షా డెబ్భైవేల డాలర్లూ సరిపోవట్లేదంటాడు. అన్న ఆ వేళే వెళ్ళి పాత టివి. బాలేదని హెచ్.డి. టి.వి. కొంటాడు.కొన్న ఉబ్బరం ఆపుకోలేక తర్వాతి రోజు పొద్దున్నే ఆఫీసులో టముకేస్తాడు.
E)కామేశ్ ఇతరులు వింటున్నారా లేదా అని కూడా చూడకుండా వాడి తాటిమొద్దు "ముద్దుకాయల" పిల్లల గుఱించి చెవిలో జోఱీగలా రొద చేస్తూ చెబుతూ ఉంటాడు.
F)కామేశ్ మట్టిబండలూ , సభ్యత లేకుండా ఎవరినైనా సరే - వయసులో పెద్దవాడైనా, చిన్నవాడైనా "నువ్వు" అనే పిలుస్తాడు.
G)కామేశ్ కి ముక్క లేందే ముద్ద దిగదంటాడు. ఇతరుల్ని ఆకుకూరలెలా తిని బతుకుతున్నారో అంటాడు.
H)కామేశ్ ఏదైనా కొనాలనుకుంటే దాని మీద ముందుగానే పేద్ద రిసెర్చి చేసేసి, దాని గురించి ఏమీ తెలీనట్టు మిమ్మల్ని అడుగుతాడు.
I)కామేశ్ కి ఇతర కులాలంటే మంట. ఆ కులాల గురించి ఆ కులపోడు సమూహంలో లేనప్పుడు ఆ కులాన్ని ఏకుతూ ఉంటాడు
J)కామేశ్ కి నచ్చిన సినిమానే సినిమా. ఇతరులకు నచ్చింది పుల్లిస్తరాకు
K)మీ టీములో నలుగురు తెల్లోళ్ళు, ముగ్గురు తెలుగోళ్ళు ఉన్నారనుకుందాం సపోసు. అందరూ కలిసి వేణ్ణీళ్ళు గొంతులో పోసుకోటానికి పోయినప్పుడు పక్కనున్న తెలుగోడితో బిగ్గరగా తెలుగులో మాట్టాడుతూ, వెకిలి నవ్వులు నవ్వుతాడు
L)పిల్లల డేకేరుకు బోల్డు డబ్బులైపోతున్నాయంటాడు...పోనీ లక్ష్మిని ఉద్యోగం మానిపించేసి ఇంట్లో ఉంచొచ్చుగా అంటే కుదిరే పని కాదంటాడు
M).....
N)....

ఇప్పుడు మిమ్మల్ని అడుగుదామనుకున్న పెశ్న

కామేశ్ తగిల్తే మీరేం జేసారు.
అ) మనకు తగ్గవాడు దొరికాడని ఆనందించారా?
ఆ) వీడెవడండీ బాబూ అని కుళ్ళి కుళ్ళి ఏడ్చారా?
ఇ) వాడి ధాటికి తట్టుకోలేక స్నేహం పంచల చాపు చించినట్టు, చించుకున్నారా?
ఈ) వాడిని చూసి మీకు లేనివి నేర్చుకున్నారా?
ఉ) వాడి ప్రతిమాటను తిప్పికొడుతూ వాడికి మనస్తాపం కలిగించారా?
ఊ) మింగలేక కక్కలేక మీ మీద మీకే అసహ్యం వేసి చెప్పుతో కొట్టుకున్నారా?
ఋ) .....
ౠ) ....
ఌ)...
ౡ)....


సమాధానం జాగ్రత్తగా చెప్పండి... :)