Wednesday, March 24, 2010

వీవెన్ - The Hidden Agenda - :) :)

వీవెన్

పరాచికానికైనా, "పోలు" స్తంభాన్ని,ధ్వజస్తంభాన్ని మించిపోయింది.. :)

మీ ఆకాంక్ష మంచిదే. ఆ మూలానికో నిర్దిష్ట రూపమివ్వాలన్న ఆలోచనా మంచిదే. మిమ్మల్ని వ్యక్తిగా ఒక పక్షం వహించమని కోరినా మీరు మొగ్గే రకం కాదని దాదాపు నాలుగైదేళ్ళుగా ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతున్న వ్యక్తిగా చెప్పగలను. కూడలికి చేటు కలిగిందా, కలుగుతుందా అన్న ప్రశ్న బోలెడు "సిద్ధాంతాల" మీద ఆధారపడి ఉంటుంది. ఆ సిద్ధాంతాల్లో బేరీజులు వేసుకున్నాక, అహంకారం వల్లైతేనేమి, అశరీరవాణి చెప్పడంవల్లైతేనేమి ఎవరికి నచ్చిన సిద్ధాంతం వాడు ఆచరించేవాడవడం వల్లా, ఒక సిద్ధాంతం పుచ్చుకుని మార్పులు చేర్పులు చేసి కొత్తది, వాడికి అనుగుణంగా మార్చుకుని ప్రతిపాదించడం వల్లా - ఇలా అంతులేకుండా సాగిపోతూనే వుంటుంది. ఇలాటి ఆచరణలు, ప్రతిపాదితాలు ద్వేషుల్లో, ఆత్మన్యూనత కప్పిపుచ్చుకునేవాళ్ళలో, "హేటు"వాదుల్లో, "ముసుగు"వీరుల్లో మరింత ప్రస్ఫుటంగా వెలుగుతూ వుంటాయి.

సరే ఈ గొడవ ఆపి నీ సిద్ధాంతం/అభిప్రాయం ఏమిటో చెప్పు అంటే మటుకు - ఒక ఉపోద్ఘాతం రాసి చెప్పాల్సి ఉంటుంది.

ఆ ఉపోద్ఘాతాలూ అవీ ఎందుకు గానీ, ముందు మీరు అడిగిన రెండు విషయాలు

1) (నేను) చూడకూడదనుకుంటున్నవి - స్థూలంగా ఈ క్రిందివి

అ)సంస్కృతిని హేళణ చేసేవి
ఆ)సంప్రదాయాలని అవహేళణ చేసేవి
ఇ)హిందూత్వాన్ని ద్వేషించేవి
ఈ)సాహిత్యాన్ని చిన్నచూపు చూసేవి

2) ఎటువంటివి - భవిష్యత్తు గురించే ఆలోచన పెడితే స్థూలంగా

అ) సంస్కృతిని "ఉద్ధరించేవి" .
ఆ) సంప్రదాయాలని "రక్షించేవి"
ఇ) హిందూత్వాన్ని "పరిరక్షించేవి"
ఈ) సాహిత్యాన్ని "బ్రతికించేవి"

పైన చెప్పిన విషయాల గోళ / గోల పరిధి విస్తృతం కాదు. ఇంకా బోలెడు చేర్చుకోవచ్చు, పెంచవచ్చు. ఐతే ఆ గోళాకారాన్ని భరించడానికి కూడలి సిద్ధంగా ఉన్నదా అన్నది ప్రశ్న. ఒకవేళ సిద్ధంగా వున్నది , లేదా సిద్ధం చెయ్యగలను అన్న జవాబు వినపడితే "మేధో మధనం" (ఇది బూతు వాక్యం అయినా!) చెయ్యొచ్చు. కొంపదీసి ఆ మేధో మధనం వల్ల చలనం కలిగో, అసలు దానితో సంబంధం లేకుండానో తెలుగు బ్లాగులు (ముద్రణ, ప్రసార, రాజకీయ మొదలైన) పెరిగితే అది బ్లాగులకు, "వీరాంగ"శూరులకూ సుదినం కావచ్చు కానీ, కూడలికి, కొండొకచో వీవెనుకు దుర్దినమే. మీరే అన్నట్టు మీ కండబలం, ధనబలం సరిపోవు - వార్తాపత్రికల మీద దాడి జరుగుతున్నట్టు కర్రలు కటార్లు తీసుకుని మీ ఇంటి ముందు తయారు అవ్వకపోతే నాకున్న కొద్దిపాటి జుట్టు కూడా గంగన్నచేత గొరిగించుకుని మీ ఇంటిముందే గాడిద మీద ఊరేగుతా.

ఇహ సాధారణంగా అందరూ నిరసించే ప్రవర్తనల సంగతికొస్తే ఒక్కోడి ప్రవర్తన, దానికి తగ్గ నిరసన ఒక్కో దారి. ప్రవర్తన ఒకడికి నచ్చలేదు అంటే ఫరవాలా, పదిమందికి నచ్చలేదు అంటే ఫరవాలా, వందమందికి నచ్చలేదు అంటే ఫరవాలా, వెయ్యి మందికి నచ్చలేదు అంటే లోపం ఎక్కడో తెలిసినట్టేగా! అలా అని మందిబలం మీద నిజాన్ని ముయ్యనూ కూడదు. తొక్కీ పెట్టాకూడదు. సంయమనం కోల్పోకుండా, శ్లేష/ హేళణ/ ఎకసక్కెం లేకుండా పద్ధతిగా రాసుకుంటే, ఇవతలివారు కూడా పద్ధతిగా మాట్టాడతారు. అలాక్కాదు గురూగారు, నేను తాడిచెట్టును, నాలోనే మత్తుపదార్ధం వున్నది కాబట్టి అదనంగా పై పదార్ధాలు జోడించి వాటితోనే రాస్తాను అన్నాడనుకోండి, తాడిచెట్టు తల మీదకెక్కటం, తల కొట్టటం జరుగుతుంది. అదే జరుగుతున్న సత్యం. కాదనలేని నిజం. ఐతే ఆ తల కొట్టటంలో ఎలా కొట్టాలి అన్న విషయం మీద అభిప్రాయభేదాలతో అభినయం కొద్దిగా ఎక్కువవ్వటమూ జరిగిన సంగతే. అందుకు ఆ నటకులు సిగ్గుపడాలి. అందులో ఇసుమంత సందేహం లేదు.

ఈ మధ్యే పరిచయమైన ఒకాయన బ్లాగుల మీద ఒక ప్రశ్న అడిగితే ఆయనతో నేనన్న మాట ఇది - మీరు చూసే బ్లాగులు చెప్పండి, దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం చెబుతా అని.! :)

సరే ఎలాగూ పై మాట చెప్పాను కాబట్టి, నేను చూసే బ్లాగుల లిష్టు ఇక్కడ అవసరం లేకపోయిన చెబుతాను... భరించాల్సిందే :) నేను చూసేవి ఇవే అనిన్నూ, ఇంకేవీ లేవనిన్నూ సభాముఖంగా తెలియచేసుకుంటున్నాను.

ఎప్పుడూ చూసేవి -

1) వీవెన్
2) బ్లాగాడిస్తా రవి
3) ఆచార్య వేమూరి
4) ఏ.పి.మీడియా రాము
5) తాడేపల్లి
6) హరిసేవ
7) హరేఫల ఫణిబాబు
8) జ్యోతి
9) దేవరపల్లి రాజేంద్ర
10) డాక్టర్ ఇస్మాయిల్
11) యోగి
12) కొత్తపాళి
13) పానశాల
14) నాగమురళి
15) తురుపుముక్క
16) భాస్కర్ రామరాజు
17) విజయమోహన్
18) దీప్తిధార

అప్పుడప్పుడు చూసేవి / ఎవరన్నా చూడమని చెబితే చూసేవి ఇంకో ఐదారు.....చూడనివాటిల్లో తెలీనివి/కొత్తవి బోలెడు...

సరే ఆ లెక్కలు, లిష్టులు పక్కనబెట్టి కూడలికొస్తే - ఒక్కటే మాట. మీ చేయి దాటిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. అది కాపాడుకోవటం కొంచెం కష్టమే కానీ అసంభవం కాదు. అవన్నీ నేను పడలేను బాబూ అంటే, మీకు నచ్చినవి, మీకు నచ్చనివి అని రెండు రకాలుగా పెట్టి సంకల్పం చెప్పుకుని, వాయనాలిచ్చేసో, కాదనుకుంటే తన్నుకోటానికి తాంబూలాలిచ్చేసో చివరాఖరిగా మంగళహారతి పాడండి, ఆడవారు కాకపోయినా. అప్పుడు గొడవుండదు. ఐతే అందులో ఒక వెధవ గోల ఉన్నది...మీకు నచ్చినవాటిల్లోనే ఎవడికన్నా తిక్క రేగిందనుకోండి (ఏ కారణం వల్లైతేనేమి - పెళ్లాంతో పోట్టాడో, ఉద్యోగం పోయో, ఊరికే మతి భ్రమించో) తిక్కరాతలు రాస్తే , దాని వల్ల ఇతరులు పుట్టించే బడబాగ్ని - కూడలికి, వీవెనుకు తట్టుకోను శక్తి వున్నదా ? లేకపోతే మళ్లీ "స్తంభాల్"ఎక్కడమేనా?...అదండీ మరి...ఇందులో శ్లేష ఉందనుకుంటే ...ఇంతే సంగతులు చిత్తగించవలెను.

అదండీ లెఖ్ఖ...మళ్ళీ తీరిగ్గా రేపో ఎల్లుండో! ఈ లోపల మధనం ప్రారంభించటానికి అసురుల్ని, దేవతల్ని పిలవండి. ఈసారి ఆదిశేషువుని కాకుండా ఇంకో నాగరాజుని పిలుద్దాం.. హాలాహలం వస్తే మీరు మింగండి. అమృతం మాకు, కూడలికి పంచండి... :) :)

వంశీ